About – పుట్టగంటి గోపీకృష్ణ

రచయిత పరిచయం

తెనాలి దగ్గర కొల్లూరు అనే గ్రామంలో జులై 14, 1965 న జన్మించాను.
తల్లితండ్రులు పుట్టగంటి వెంకటేశ్వర్లు, అచ్చమాంబ.
భార్య పేరు తనూజ.

హర్షల. సుదర్శన్‍ నా కూతురు, అల్లుడు.

ఒక మనవరాలు. పేరు వర్ణన.
ఉద్యోగం సిండికేట్‍ బ్యాంకులో.
ప్రస్తుతం డెప్యుటేషన్‍ మీద కర్ణాటక లోని ధార్వాడ్‍లో ఉన్న కర్ణాటక వికాస్‍ గ్రామీణ బ్యాంక్‍ (KVGB)  చైర్మన్‍గా పనిచేస్తున్నాను.
రచయితగా ప్రస్థానం ప్రారంభించింది 2007లో.

 

నాలుగయిదు చిన్న కథలు రాశాక మొదటి నవల మేధోమథనం 2008లో  రాశాను.

సాక్షి ఫన్‍డేలో సీరియల్‍గా అది అగస్టు 2, 2009 నుండి డిసెంబర్‍ 20, 2009 వరకు ప్రచురింపబడి మంచి పేరు తీసుకొచ్చింది.

అలా మొదలయిన రచనా వ్యాసంగం… ప్రస్తుతానికి 35 నవలలు, దాదాపు 90 కథలు రాసేవరకు ఎదిగింది.

ఈ ప్రయాణంలో కొన్ని బహుమతులు కూడా అందాయి.

నేను రాసిన ‘సింహధ్వని’ నవల… ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ నవలగా పురస్కారం పొందింది.

ఇక స్వాతి వీక్లీలో ఇప్పటికి 8 నవలలు సీరియల్‍గా వచ్చాయి. రియల్‍ హీరో, మీసాల మన్మధుడు, వైభవ్‍ టవర్స్‍, డూప్లికేట్‍, అఆఇఈ, క్వీన్‍ మేరీ, వేట, ఇద్దరి కలయిక… అనే నవలలు మంచి ప్రాచుర్యం పొందాయి.

స్వాతి మంత్లీ ప్రతి సంవత్సరం నవలల కోసం నిర్వహించే అనిల్‍ అవార్డు 2017 సంవత్సరానికి గానూ గౌరీ కళ్యాణం అనే నవలకు దక్కింది. అది కాక సింహధ్వని, మరో ప్రయత్నం, హైజాక్‍ అనే నవలలు కూడా స్వాతి మంత్లీలో అనుబంధ నవలలుగా వచ్చాయి.

ఆంధ్రభూమి దినపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతి రణక్షేత్రం అనే నవలకి వచ్చింది. ఆంధ్రభూమి వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతి ‘నిన్నటి నేడే రేపు’ అనే నవలకి వచ్చింది.

జాగృతి వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతి ‘రాజగురువు’ అనే నవలకు ఈమధ్యనే వచ్చింది.

నవలలు మాత్రమే కాకుండా నేను రాసిన కథలు కూడా స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన సరస కథల పోటీలో, సాహస కథల పోటీలో, కథకథకథల పోటీలో బహుమతులు పొందాయి. సాక్షి ఫన్‍డేలో, ఆంధ్రభూమి వార పత్రికలో, జాగృతి వార పత్రికలో, నవ్య వారపత్రికలో కూడా నా కథలు బహుమతులు పొందాయి.

ప్రస్తుతం ఆ కథలు, నవలలన్నిటినీ ఈ బ్లాగులో ఉచితంగా చదువుకునే సౌకర్యం కలిగిస్తున్నాను.

అలాగే పాఠకులు తమ ఫీడ్‍బాక్‍ ఇచ్చే సౌకర్యం కూడా కలిగిస్తున్నాను.

Scroll to top